మానవుల, సమాజ హితంకోరి, శృంగార జీవనంలోని మాధుర్యాన్ని ఎలా అనుభవించవచ్చు. స్త్రీలు, పురుషులు వారి వారి జాతులు, స్త్రీ ఎటువంటి పురుషుని ఇష్టపడుతుంది తదితర విషయాలను సవివరంగా వాత్స్యాయనుడు తన గ్రంథంలో చర్చించాడు. కామశాస్త్రం గ్రంథాన్ని ఏడు అధికరణలుగా విభజించి అందులో శృంగారానికి సంబంధించిన అనేక విషయాలు తెలిపాడు
వాత్స్యాయనుని కామసూత్రంలో మొదటి అధికరణం సాధారణాధికరణం. కళలు, ఎటువంటి వారు కళారాధన చేయచ్చు, నాగరిక జీవనం, మానవుని జీవిత దశలు. శృంగారాది కార్యక్రమాలలో ప్రాథమిక విషయాలు ఈ అధ్యాయంలో సుబోధకంగా తెలిపాడు. ఇప్పటి వరకు ఇక్కడ చదివిన విషయాలలో చాలా వరకు సాధారణాధికారంలోని మొదటి అధ్యాయంలో వాత్స్యాయనుడు తెలిపినవే. ఆ విషయాలను సందర్భానుసారంగా మరోసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మానవ జీవనంలోని వివిధ దశల గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం.
మానవ జీవితాన్ని బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అని సామాన్యులు విభజించినట్టే వాత్స్యాయనుడు కూడా విభజించాడు. పదిహేనేళ్లు నిండేవరకు బాల్యదశగా, అపై సుమారు 50 సంవత్సరాల వయసు వరకు మధ్య దశగా, ఆ తర్వాతి కాలాన్ని వృద్ధాప్యంగా విభజించాడాయన. బాల్యంలో విద్యాభ్యాసం చేయాలి. యవ్వనంలో ధనాన్ని ఆర్జించి సుఖవంతమైన, శృంగారమయమైన జీవితాన్ని గడపాలని, వృద్ధాప్యంలో మోక్షం కోసం కృషి చేయాలని వాత్స్యాయనుడు వివరించాడు. యవ్వనంలో శృంగార మయమైన జీవితాన్ని గడపాలని చెప్పి మాత్రమే ఆయన ఊరుకోలేదు. శృంగార జీవితంలోని ప్రతి కోణాన్నీ తన గ్రంథంలో సవివరంగా తెలిపాడు.
విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు కోరికలను అదుపులో ఉంచుకోవాలని వాత్స్యాయనుడు సూచించాడు. అయితే కామ శాస్త్రాన్ని నిరభ్యంతరంగా అధ్యయనం చేయవచ్చాన్నాడు. అంటే విద్యార్ధి దశలో బ్రహ్మచర్యం పాటిస్తే అతని భావి జీవితం బాగుంటుందని, కోరికలలో కొట్టుకునిపోతే దెబ్బతింటాడని ఆయన ఉద్దేశం కావచ్చు. ఏదేమైనా మన వేదాలతో పాటు వాత్స్యాయనుడు కూడా ముందుగా ధనార్జనకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాతే కామ కేళీ విలాసాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
'అసలు కామం అంటే ఏమిటి?' అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఏమని జవాబు చెబుతాం. అదో కోరిక అని సంక్షిప్తంగా చెబుతాం. అదే వాత్స్యాయనుడు ఏమని నిర్వచిస్తున్నాడో చూడండి. ''ఆత్మతో కూడిన జీవి మనసు ఇంద్రియాల సహాయంతో నెరవేర్చే క్రియ. ఈ క్రియల ద్వారా మనసుకు, శరీరానికి అంతులేని ఆనందం, సుఖం కలుగుతాయి ఆ ఆనందమే కామం'' అంటే కామం గురించి మనకు తెలిసిన అర్ధం, వాత్స్యాయనుడు చెప్పింది ఒకటి కాదు. కామమంటే చాలా విస్త్రుతమైన అర్ధాన్నిచ్చాడాయన. అయితే ఇక్కడ గమనించవలసినదేమిటంటే కామాన్ని రెండుగా విభజించాడు వాత్స్యాయనుడు. అందులో సామాన్య కామానికి ఇచ్చిన అర్ధమిది.
వాత్స్యాయనుడు చెప్పిన కామంలలో రెండవది విశేష కామం. మనకు సామాన్య, వ్యవహారిక పదజాలంలో తెలిసిన అర్ధాన్నిచ్చేది ఇదే. దీన్ని గురించి వాత్స్యాయనుడు ఏమంటాడో చూడండి. ''శృంగార క్రియ వల్ల స్త్రీ, పురుషులకు కలిగే ఆనందం, సుఖం విశేష కామం.'' ఇక్కడ స్త్రీకి పురుషునిపై, పురుషునికి స్త్రీపై ఎంతోకొంత అనురాగం జనించాలి. ఒకరిపై ఒకరికి పరస్పరం ప్రేమానురాగాలు జనించాలి అప్పుడే అది ఈ నిర్వచనం పరిధిలోకి రాగలుగుతుంది అని కూడా ఆయన చెప్పాడు.
ఇంతకుముందు చెప్పినట్టుగా వాత్స్యాయనుడు కామ పరమైన సుఖాల కంటే మిగిలిన పురుషార్ధాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ముందుగా ధర్మాన్ని నిర్వర్తించాలి. తర్వాత అర్ధాన్ని (ధనాన్ని) ఆర్జించాలి. ఆ తర్వాతే కామమన్నది. ఇందులో సాధారణ మనిషి జీవితానికి సంబంధించిన ధర్మం స్పష్టంగా ఉంది. అదేమిటంటే ముందుగా ధనాన్ని సంపాదించే మార్గాన్ని వెతుక్కోవాలి. తర్వాతే ఏదైనా. సామాజిక జీవితం ఏర్పడిన తర్వాత వందల సంవత్సరాలకు ఇటువంటి నియమాలు ఏర్పరిచారు. ఇప్పటికీ ఈ నియమాలు అనుసరణీయంగా ఉన్నాయి.
0 nhận xét:
Đăng nhận xét